జ్ఞాపకం ఉంచుకోవలసిన ముఖ్య విషయాలు
- మనిషి ఎల్లప్పుడూ మనిషే మన పూర్వులు అంటే మన తండ్రుల తాతల తాతముత్తాతలు కోతులవంటి జంతువులుగా ఉండేవారని, వారు క్రమేణా మార్పు చెందుతూ మానవులయ్యారనే పరిణామవాదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుల సిద్ధాంతాలు నిరాధారాలు, అభూత కల్పనలు, పాపం; ఈ ప్రబుద్ధులు మోసపోయారు. దైవ కాంతి కిరణాలు చొరబడని బుర్రలూ, బుద్ధులూ వీళ్ళవి. మానవులందరు ఆది మానవుడయిన హజ్రత్ ఆదమ్ సంతతివారే.
- తప్పు చేయడం సహజం. పొరపాట్లు చేయకుండా ఉండేదెవరు? తప్పు చేసిన తరువాత, పశ్చాత్తాపపడటం, క్షమాపణ వేడుకోవడం బుద్ధిఉన్న ప్రతి మనిషి చేయవలసిన పని, పశ్చాత్తాప పరితప్త హృదయులయిన వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, క్షమిస్తాడు. చేసిన తప్పును ఒప్పుకోవడం తమ గౌరవానికే భంగమని విర్రవీగేవారు మూర్ఖులు, షైతాన్ సహచరులు. అలాంటి వారు దుష్టుడయిన షైతాన్తోపాటు నరకాగ్నిని చవిచూడవలసి ఉంటుంది.
- భూలోకానికి విచ్చేసిన ఆది మానవుడు ప్రథమ దైవప్రవక్త. మానవులు తినటానికి, త్రాగటానికి, ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసినట్లే జీవితం గడపటానికీ సరియైన సత్యమయిన రుజుమార్గాన్ని చూపాడు.
- భూమిపై మానవుడు దైవప్రతినిధిగా జీవించాలి. దేవుడు మనకిచ్చిన వరాలను, కానుకలను ఆయన కోరిన విధంగా వినియోగపరచాలి. ఇలలో వున్న ఏ వస్తువుకూ మానవుడు యజమాని కాదు. మనిషి విశృంఖలంగా జీవించటానికి వీల్లేదు. ఈ లోకం దైవానిది. కనుక అధికారం. ఇష్టం, శాసనం దైవానికి చెందినవే చలామణి కావాలి.
- దైవోపదేశాలకు, దైవాదేశాలకు అనుగుణంగా జీవించే మానవులు అసలయిన దైవభక్తులు. ఇలాంటివారికే పరలోకంలో స్వర్గప్రాప్తి. దేవుని ఉనికిని తిరస్కరించేవారు, దైవప్రతినిధిగా తమకున్న కర్తవ్యాన్ని నిర్వహించనివారు దైవాగ్రహానికి గురి అవుతారు. పరలోకంలో వారికి నరకం సంప్రాప్తమవుతుంది.
మూలం:- మౌలానా అబూ సలీం అబ్దుల్ హై అనువాదం: – షేఖ్ హమీదుల్లా షరీఫ్, బి.ఏ.
