బహిష్కరింపబడిన షైతాన్ తీవ్ర ఆత్మసంక్షోభానికి, బాధకు గురి అయ్యాడు. చేసిన తప్పును ఒప్పుకొని, పశ్చాత్తాపపడి, క్షమాభిక్ష పెట్టమని దయామయుడయిన భగవంతుణ్ణి వేడుకోవలసింది. కాని అతడు ఆ విధంగా చేయలేదు. తన పతనానికి ఆదమ్, హవ్వాలే కారణమని తలంచి, వారిపై పగ పట్టాడు; ప్రతీకారం చేయదలచాడు. “ఫలానా వృక్షాన్ని తాక వద్దు” అని ఆదమ్, హవ్వాలను దేవుడు ఆదేశించిన విషయం షైతాన్కు తెలుసు. ఒక రోజున, అమాయకత్వం ఉట్టిపడే ముఖంతో, సాధుత్వం నటిస్తూ వారి దగ్గరకు పోయి, తన కపట నాటకాన్ని ప్రారంభిస్తాడు షైతాన్. “స్వర్గంలో ఉన్న ఐశ్వర్య సంపదలనన్నింటినీ మీకు యిచ్చి, ఒకే ఒక వృక్షాన్ని ముట్టుకోవద్దని దేవుడు ఎందుకు నిషేధించాడో మీకు తెలుసా? అసలు విషయం ఏమంటే, ఈ వృక్షం చాలా మహత్తు కలది. దీని ఫలాన్ని సేవించిన వారికి చావురాదు. మీరు దీని ఫలాన్ని తిన్నట్లయితే అమరులవుతారు: దేవదూతలవుతారు. నేను ప్రమాణం చేసి చెపుతున్నాను. నేను మీ మిత్రుణ్ణి, మీ యోగ క్షేమాలను కోరేవాణ్ణి కనుకనే ఈ రహస్యాన్ని మీకు తెలియజేస్తున్నాను” అని షైతాన్ అమాయకులయిన ఆదమ్, హవ్వాలను దైవాజ్ఞను ధిక్కరించమని ప్రేరేపిస్తాడు.
అమాయకునిగా, సాధుపుంగవునిగా, కపట నాటకమాడిన షైతాన్, వారికి బద్ధవిరోధి, గోముఖవ్యాఘ్రం అని ఆదమ్ హవ్వాలకు తెలియదు పాపం! షైతాన్ పన్నిన పన్నాగం ఫలించింది. అతని మోసానికి వారిద్దరు గురి అయ్యారు. దేవుని నిషేధాజ్ఞలను ఉల్లంఘించారు, ఆ వృక్ష ఫలాన్ని వారు సేవించారు. తత్క్షణమే వారి శరీరాలపై ఉన్న వస్త్రాలు మాయమయ్యాయి. ఆది మానవులు దిగంబరులయ్యారు. భయభీతచిత్తులై వారు తమ దేహాన్ని చెట్ల ఆకులతో కప్పుకున్నారు. అప్పుడు వారు ఘోరపాపం జరిగిపోయిందని వాపోయారు. వారి ప్రభువు వారిని ఆగ్రహించాడు.
చేసిన పాపానికి పరితపిస్తూ, పశ్చాత్తాపంతో విలపిస్తూ తమను క్షమించమని దేవుణ్ణి వేడుకున్నారు. షైతాన్ మాదిరిగా వారు గర్వపడలేదు. చేసిన నేరాన్ని ఒప్పుకొని, మన్నించమని దైవాన్ని అర్థించారు. అత్యంత దయామయుడయిన దేవునికి వారి వైఖరి నచ్చింది. దైవం వారిపై దయచూపి వారిని మన్నించాడు. “షైతాన్ మీకు బద్ధ శత్రువు. ఇకముందు అతని మాటలకు మోసపోవద్దు” అని అల్లాహ్ వారికి తెలిపాడు.
అపుడు ఆదమ్, హవ్వాల నివాసం భూలోకానికి మారింది. దైవం వారితో, “కొంతకాలం మీరు భూలోకంలో నివసించండి. నా సంతోషానికి దోహదమయ్యే అన్ని పనుల్ని చేయండి” అని దైవ సంతోషాన్ని పొందటానికి చేయవలసిన పనులన్నింటిని గురించి తెలిపాడు. ఆ విధంగా భూమండలానికి హజ్రత్ ఆదమ్ తొలి మానవునిగా, మొదటి దైవప్రవక్తగా ఆవిర్భవిస్తారు.
“మీలో మంచి పనులు చేసిన వారు, తాము దైవ ప్రతినిధులమని భావించి తదనుగుణంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నవారు, మరణించి మా వద్దకు మరలి వచ్చినపుడు వారికి మేము మళ్ళీ స్వర్గం అనుగ్రహిస్తాము. మా మార్గాన్ని అవలంబించనివారు షైతాన్ అనుచరులు, వారందరు షైతాన్తో పాటు నరకానికి పోవలసి ఉంటుంది” అని సర్వేశ్వరుడు వారికి మహోపదేశం చేశాడు.
