3 Aug 2025, Sun

హజ్రత్ ఆదమ్ (అలైహిస్సలాం)

దైవదూతలందరూ హజ్రత్ ఆదమ్ (అ)పట్ల గౌరవసూచకంగా ఆయన ఎదుట సాష్టాంగపడవలసిందిగా అల్లాహ్ ఆదేశిస్తాడు. ఆ సమయంలో అక్కడ షైతాన్ కూడా ఉంటాడు. దైవాజ్ఞ అయినంతనే, దైవదూతలందరూ ఒక్కుమ్మడిగా ఆదమ్(అ)కు సాష్టాంగపడతారు. కాని షైతాన్ నిరాకరిస్తాడు, దైవాజ్ఞను ఉల్లంఘిస్తాడు. అహంభావం అతనిచే తిరుగుబాటు చేయిస్తుంది. గర్విష్ఠి అయిన షైతాన్ పరాత్పరునితో, “ప్రభూ! మట్టితో సృజించబడ్డ ఈ మానవునికి నేను సాష్టాంగపడను. నేను అతనికంటే అధికుణ్ణి. నీవు నన్ను అగ్నితో సృష్టించావు’ ‘అన్నాడు. షైతాన్ చూపిన ఆ ధిక్కారం వల్ల అతడు దైవాగ్రహానికి లోనవుతాడు. దురహంకారి అయిన షైతాన న్ను అల్లాహ్ తన దర్బారు నుండి బహిష్కరిస్తాడు. ప్రళయకాలం వచ్చే వరకు భూలోకం షైతాన్కు స్థావరం అవుతుంది. తీర్పుదినంనాడు షైతాన్, అతని ఉపదేశాలను పాటించినవారు నరకవాసులవుతారు.

హజ్రత్ ఆదమ్ (అ)కు తోడుగా ఉండటానికి ఒక స్త్రీ మూర్తిని కూడా దేవుడు సృష్టించాడు. ఆమె పేరు హవ్వా (అ). హజ్రత్ హవ్వా (అ) మానవులందరికీ మాత. ఆదమ్, హవ్వాలు భగవదాజ్ఞానుసారం స్వర్గలోకంలో నివసిస్తూ ఉంటారు. స్వర్గంలో అన్ని సుఖాలు ఉంటాయి. తినటానికి అత్యంత రుచికరమైన పండ్లూ ఫలాలు, త్రాగటానికి మధుర పానీయాలు, విశ్రాంతికి, విహారానికి కావలసిన అన్ని హంగులూ ఉంటాయి. స్వర్గలోకంలో, కరుణామయుడయిన దేవుడు వారితో, “మీరు ఈ స్వర్గలోకంలో హాయిగా జీవించండి. మీకు ఏది అవసరమో దాన్ని తృప్తికరంగా తినండి, త్రాగండి కాని (ఒక వృక్షాన్ని చూపుతూ) ఆ చెట్టు దరిదాపులకు పోకూడదు. దాని వల్ల మీకు ఏ ప్రయోజనమూ లేదు” అని ఆజ్ఞాపించాడు; ఆది మానవులిద్దరూ స్వర్గలోకంలో సుఖంగా ఆనందడోలికల్లో ఊగుతూ జీవిస్తూ ఉండేవారు.

One thought on “హజ్రత్ ఆదమ్ (అలైహిస్సలాం)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *