3 Aug 2025, Sun

హజ్రత్ ఆదమ్ (అలైహిస్సలాం)

ఎల్లప్పుడూ అందంగా, అద్భుతంగా, అపూర్వంగా కనిపించే ఈ భూలోకం ఒక మహోజ్వలమయిన దైవ సృష్టి. ఇప్పుడు మానవ లోకంగా అలరారుతున్న ఈ గోళంలో ఒకప్పుడు మానవ జాతి లేదు. మానవుణ్ణి సృష్టించి ఈ భూమండలానికి పంపుదామనే సంకల్పం కలిగింది సృష్టికర్తకు. తత్ఫలితంగా ఆది మానవుణ్ణి సృష్టించాడు కరుణామయుడైన దేవుడు. ఆ మానవుణ్ణి మట్టితో సర్వాంగ సుందరంగా తయారుచేసి ప్రాణం పోశాడు. ఆ ఆది మానవుడే హజ్రత్ ఆదమ్ (అ). మీరు, మేము అంతా ఆయన సంతానమే.

మానవుల కంటే ముందే, దేవుడు జిన్నులను, దేవదూతల్ని సృష్టించాడు. ఆది పురుషుడయిన ఆదమ్ (అ)ను సృష్టించే ముందు దేవుడు దేవదూతలను ఉద్దేశించి, “మేము ఆదమ్(అ)ను సృష్టించి మా ప్రతినిధిగా భూలోకానికి పంపదలచినాము” అన్నాడు. ప్రతినిధి లేక ఖలీఫా అంటే ఎవరో మీకు తెలుసా? ఉదాహరణకు, మీరు ఒక పెద్ద ఆస్తికి యజమానులనుకోండి. ఆ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలను చూడడానికి ఒక మనిషిని పంపిస్తూ, చేయవలసిన పనిని గురించి అతనికి మీరు కొన్ని ముఖ్యవిషయాలు తెలుపుతారు. ఆ విధంగా మీరు పంపే ఆ వ్యక్తే మీకు ఖలీఫా లేక ప్రతినిధి. ఈ భూమిపై మానవుణ్ణి తన ఖలీఫాగా దేవుడు ఇదే ఉద్దేశ్యంతో సృష్టించాడు. ఈ లోకానికి అసలు అధిపతి. యజమాని దాన్ని సృష్టించిన దైవం. మానవుడు ఆ దైవానికి ఖలీఫా లేక ప్రతినిధి. కనుక, మనిషి నియమిత కార్యాన్ని సాధించటానికి భువికి పంపబడ్డాడు. ఆ కార్యనిర్వహణకు, ఆ లక్ష్య సాధనకు అవసరమయిన ముఖ్య విషయాలన్నింటిని తెలిపాడు దేవుడు. కనుక మానవుడు తన జీవిత లక్ష్యాన్ని గ్రహించి, తాను చేయవలసిన పనిని దైవాజ్ఞానుసారం చేయాలి. ఎవరయితే ఆవిధంగా చేస్తారో, వారే ఖలీఫాకున్న బరువుబాధ్యతలను నిర్వహించినవారవుతారు. వారి జీవితమే సార్ధకం.

మానవుణ్ణి సృష్టించి, తన ప్రతినిధిగా భూలోకానికి పంపదలచినట్లుగా అల్లాహ్ దేవదూతలకు తెలుపగానే వారు భయాందోళనలు చెంది ఎంతో వినమ్రతతో, “మహాప్రభూ! కల్లోలాన్ని రేపి, రక్తాన్ని చిందించే ఈ మానవుణ్ణి నీ ప్రతినిధిగా నియమిస్తావా? నీ మహిమను, నీ కీర్తిని ఎల్లవేళలా కీర్తిస్తూ, నీ సేవలో నిమగ్నులమై ఉన్నామే! ” అన్నారు. అప్పుడు సర్వజ్ఞుడయిన దేవుడు వారితో అన్నాడు, “మాకు తెలిసిన విషయాలు మీకు తెలియవు. మానవ సృష్టిలో మేము ఏ అపూర్వశక్తుల్ని ఉంచామో మీకు తెలియదు. ఇతడు భూలోకానికి పోయి మాచే ప్రసాదితమయిన జ్ఞానాన్ని. శక్తిసామర్థ్యాలను ఉపయోగించి మా గర్భంలో దాగి ఉన్న నిధుల్ని వెలికితీస్తాడు, మేము సృష్టించిన వస్తువుల్ని ఉపయోగిస్తాడు. మీకు ఈ విషయాలు తెలుసేమో చెప్పగలరా?” పాపం, దేవదూతలకు ఈ రహస్యాలన్నీ తెలియవుగా! అప్పుడు వారు వినయ విధేయతలతో, “ఓ ప్రభూ! నీవు తెలిపిన విషయాలుతప్ప మాకు మరే ఇతర జ్ఞానమూ లేదు. నీవు సర్వమూ తెలిసినవాడవు, ప్రజ్ఞానిధివి” అన్నారు.

తరువాత సృష్టికర్త ఆదమ్ (అ)తో, “ఆదమ్! ఈ వస్తువుల స్వరూప స్వభావాలను తెలుపు” అని ఆజ్ఞాపించాడు. (హజ్రత్ ఆదమ్ (అ)ను సృష్టించినపుడే భూలోకంలో ఉన్న సమస్త వస్తువుల స్వరూప స్వభావాలను అవగాహన చేసుకునే వివేకాన్ని దేవుడు ఆయనకు ప్రసాదించాడు) దైవాజ్ఞానుసారంగా, హజ్రత్ ఆదమ్(అ) అన్ని విషయాలను గురించి తెలుపగా అల్లాహ్ దేవదూతలతో ఈ విదంగా అన్నాడు, “భూమ్యాకాశాల్లో దాగి ఉన్న సమస్త రహస్యాలు మాకు తెలుసని మేము మీకు తెలిపియుండలేదా? మీరు ప్రకటించేవీ, దాచేవీ అన్నీ మాకు తెలుసు.”

One thought on “హజ్రత్ ఆదమ్ (అలైహిస్సలాం)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *