మహాశయులారా!
సాధారణంగా బాహ్య స్వరూపం రీత్యా ఇద్దరు వ్యక్తుల పనులు ఒకే విధంగా ఉంటాయి. కాని పరలోకంలో లభించే ఫలితాన్ని బట్టి వాటిలో చాలా తేడా ఉంటుంది. మీ కళ్ళెదుట ఇద్దరు వ్యక్తులు ఒకే విధమైన సత్కార్యం చేస్తున్నట్లు కనిపించడం సాధ్యమే. ఉదాహరణకు ఆ ఇరువురు చెరొక బావిని త్రవ్వించారు. కాని వారిలో ఒకతనికి పరలోకంలో తాను చేసిన పనికి సత్ఫలితం లభిస్తే, మరొకనికి ఏమీ లభించదు. ఎందుకని?
పరలోకంలో మనిషికి లభించే ప్రతిఫలం అతని సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. సంకల్పం బాగుంటే అతనికి తన సత్కర్మల పుణ్యఫలం లభిస్తుంది. లేకపోతే పుణ్యఫలం లభించదు. ఏ పనయినా దేవుని ప్రీతి కోసం, అదీ ఆయన చూపిన పద్ధతి ప్రకారం చేస్తే పరలోకంలో దాని ప్రతిఫలం లభిస్తుంది. అయితే సత్కార్యం వెనుక దైవప్రీతికి బదులుగా మరొక ఉద్దేశ్యం ఉంటే పరలోకంలో దానికి ఎలాంటి విలువా ఉండదు. ఒక వ్యక్తి కేవలం పేరు ప్రతిష్ఠల కోసమని, తనను అందరూ మంచి వాడిగా భావించాలని బావిని త్రవ్విస్తే ఇంకా ఆ పేరు ప్రతిష్ఠల కారణంగా అతనేదయినా లాభం పొందగోరితే అలాంటి వ్యక్తికి పరలోకంలో అతను చేసిన ఆ పనికి ప్రతిఫలం లభించకూడదు. దేనికోసమయితే అతను పని చేశాడో అదే అతనికి లభించాలి. ఇదే న్యాయం కూడా. అయితే మరొక వ్యక్తి దైవం తనకు సిరిసంపదలు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా బావిని త్రవ్విస్తాడు. ఈ సత్కార్యం వల్ల తన ప్రభువు సంతోషించాలని కోరుకుంటాడు. ఇంకా ఈ బావి వల్ల ప్రజలు కొంతకాలం వరకు ప్రయోజనం పొందా లని ఆశిస్తాడు. అలాంటప్పుడు అతనికి పరలోకంలో దాని ప్రతిఫలం తప్పనిసరిగా దొరకాలి.
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజిఅన్) ఉల్లేఖించిన ఒక హదీసులో మహాప్రవక్త (సఅసం), “కర్మలు మనోసంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషికి తాను సంకల్పించిన వస్తువే ప్రాప్తమవుతుంది” అని తెలిపారు. అదే హదీసులో దైవప్రవక్త (సఅసం) ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, “ఎవరయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం హిజ్రత్ చేస్తారో వారి హిజ్రత్ మాత్రమే నిజమయినది. ఎవరయితే ప్రాపంచిక సిరిసంపదల కోసం, లేదా ఒక స్త్రీతో వివాహమాడటానికి హిజ్రత్ చేస్తారో వారి హిజ్రత్ ప్రపంచం కోసమో లేక ఒక స్త్రీ కోసమో చేసిన హిజ్రత్ గా పరిగణించబడుతుంది” అని సెలవిచ్చారు.
ఇస్లామ్ దృష్టిలో ‘హిజ్రత్ ఓ గొప్ప ఆరాధన, పుణ్యకార్యమని మీ అందరికీ తెలుసు. అయితే పుణ్యం లభించాలని, దైవప్రీతి పొందాలని చేసినప్పుడే హిజ్రత్ వల్ల పుణ్య ఫలం లభిస్తుంది. ఒకవేళ హిజ్రత్ చేసేటప్పుడు సయితం సంకల్పంలో ఏదయినా చెడు ఉద్దేశ్యం కలిగితే దానికి ఎలాంటి విలువ లేదు. ఉదాహరణకు – ఈ విధంగా తన దేశం వదలి పరదేశానికి పోతే అక్కడ తన వ్యాపారం బాగా వృద్ధి పొందు తుందని, లేదా అక్కడికి చేరిన తరువాత ఫలానా స్త్రీని వివాహమాడవచ్చునని, లేదా అలాంటిదే మరేదయినా ప్రయోజనం పొందవచ్చునని అనుకుంటే అలాంటి వ్యక్తి చేసిన హిజ్రత్కు దేవుని దృష్టిలో ఎటువంటి విలువలేదని మహాప్రవక్త (సఅసం) అన్నారు.
ఈ విషయాన్ని గురించి దివ్యఖుర్ఆన్, హదీసుల్లో స్పష్టంగా వివరించబడింది. ప్రతి సత్కార్యం చేసే ముందు మనిషి తన సంకల్పం పట్ల శ్రద్ధ వహించాలని నొక్కి చెప్పబడింది. ఒకసారి మహాప్రవక్త (సఅసం) “అల్లాహ్ మీ రూపురేఖల్ని, మీ సిరిసంపదల్ని పరిశీలించడు, ఆయన మీ అంతర్యాన్ని, మీ ఆచరణను (మాత్రమే) గమనిస్తాడు” అని ప్రవచించారు.
సోదరులారా!
ఇది ఎంతో సున్నితమయిన అంశం. మనం దీన్ని గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. మీరెన్ని సత్కార్యాలు చేసినా మీకు సంకల్ప శుద్ధి లేకపోతే మీరు చేసిన దంతా వృధా అవుతుంది. ఈ విధంగా మీరేది కోల్పోతారో ఆలోచించండి. దురదృష్ట కరమయిన ఓ రైతు విషయం వినండి: అతను ఎంతో శ్రమపడి భూమిని దున్నాడు. మేలు జాతి విత్తనాలు నాటాడు. పొలం పనిలోనూ, కావలి పనిలోనూ కొరత చేయలేదు. కాని కోత సమయం దగ్గరపడగానే పంటకు వ్యాధి సోకి ఒక్క గింజ కూడా పండకుండా తాలు మాత్రమే మిగిలినట్లు గమనించాడు. అచ్చంగా ఇలాంటి పరిస్థితే సంకల్ప శుద్దిలేని పనులదీనూ. చూడటానికి అవి పైకి ఎంతో మంచి పనులుగా కనిపించినా, వాటి వెనుక ఎంతోశ్రమ, ధన వ్యయం ఉన్నా సంకల్పం సరిగా లేని కారణాన పరలోకంలో వాటికి ఎలాంటి ప్రతిపలం లభించదు. ఇహలోకంలోనే అతనికి లభించవలసిందేదో లభిస్తుంది. ఇతని స్థితి అచ్చం పంట కోసేటప్పుడు తాలు తప్ప మరేమీ చేతికి లభించని రైతులా ఉంది.
సోదరులారా!
ఇది మనమెంతో ఆలోచించవలసిన విషయం. మనమంతా సాధ్యమైన సత్కార్యాలన్నీ చెయ్యడానికి ప్రయత్నిస్తాం. వాటి కోసం సమయం, డబ్బు కూడా ఖర్చుపెడతాం. అయితే అప్పుడు మనం మన సంకల్పం ఎలా ఉందన్న విషయాన్నిగురించి పరిశీలించుకోవడం ఎంతో అవసరం. లేకుంటే సంకల్పంలో ఏదయినా లోపం పొడసూపి దురదృష్టవశాత్తు మన కర్మలన్నీ వృధా కావచ్చు. మనం ఏ సత్కార్యం చేసినా దాని వెనుక దైవప్రీతి, పుణ్యం పొందే ఉద్దేశ్యం తప్ప మరేదీ ఉండకుండా ఎల్లప్పుడు జాగ్రత్తపడాలి. షైతాన్ మనిషికి పరమ శత్రువు. వాడు మనిషిని సన్మార్గానికి బదులుగా దుర్మార్గంలో పడవేయడానికే మొట్టమొదట ప్రయత్నిస్తాడు. అందులో విజయవంతం కాలేకపోతే, మానవుని సత్కర్మల్ని ఏ విధంగా వృధా చేయాలి అని పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. దానికోసం వాడు ఎన్నుకున్న గట్టి మార్గం ఏమిటంటే మనం చేసే సత్కార్యాలకు మనలో రకరకాల చెడు ఉద్దేశ్యాలను పుట్టిస్తాడు. లోకులు చూసి గొప్ప భక్తుడు, పుణ్యాత్ముడని భావించాలన్న ఉద్దేశ్యంతో నమాజ్ చేసేలా మనల్ని షైతాన్ ప్రేరేపిస్తాడు. అలాగే మనం పేదలకు సహాయం, సంఘసేవ చేస్తున్నప్పుడు, “లోకులు నా దాతృత్వాన్ని గురించి చెప్పుకోవాలి, వారి హృదయాల్లో నా పట్ల గౌరవభావం కలగాలి: ఈ పేరు ప్రతిష్టలకు మూలంగా సంఘంలో నాకు మంచి స్థానం లభించాలి” అనే ఆలోచనల్ని మనలో వాడు కలిగింపజేస్తాడు. చివరికి ధర్మ సంస్థాపనం కోసం పాటుపడే హృదయాల్ని షైతాన్ తప్పుదోవ పట్టిస్తాడు. వారిలో కూడా అధికార పిపాస తప్ప మరే సదుద్దేశమూ మిగలకుండా చేస్తాడు.
సోదరులారా!
ఇది ఎంతో ప్రమాదకరమయిన స్థితి, అసలు ముస్లిమ్లనే వ్యక్తి మంచి పనులు కోరేవాడయి మాత్రమే ఉండాలి. అయితే అతను తన సంకల్పాన్ని గురించి అంతకంటే ఎక్కువ జాగ్రత్త వహించాలి. సంకల్పం సవ్యంగా లేని కారణంగా అతను చేసే సత్కర్మలన్నీ బూడిదలో పోసిన పన్నీరు కావచ్చు. దైవం ప్రసాదించే పుణ్యఫలం తప్ప గత్యంతరంలేని పరలోకంలో అతనికి ఏమీ దక్కక పోవచ్చు. పేరు ప్రతిష్ఠల పిపాస, ప్రదర్శనా వాంఛ మానవుని మనస్సులో అతనికి తెలియకుండానే చోటు చేసుకుంటాయి. అతను తన నోటితో ఎంతో మంచి మంచి మాటలు పలకవచ్చు. కాని లోకులు తనని మంచివాడని భావించాలన్న కోరిక తద్వారా తాను గొప్పవాడయిపోవాలన్న తపన అతని హృదయంలో తిష్ఠవేస్తాయి. ఆ విధంగా మనిషి చేసుకున్న సత్కార్యాలన్నీ వృధా అవుతాయి.
సోదరులారా!
అల్లాహ్ మనల్ని ఇలాంటి స్థితినుండి రక్షించాలని మనమంతా చిత్తశుద్ధితో దుఆ చేయాలి. ఇంకా మనం చేసే సత్కర్మల వెనుక దైవప్రీతి తప్ప మరే ఉద్దేశ్యమూ లేకుండా ఉండేలా ప్రయత్నించాలి.
మూలం: మౌలానా అబూ సలీమ్ అబ్దుల్ హై (రహ్మలై) అనువాదం:అబుల్ ఇర్ఫాన్
10 basic knowledge of islam that every Muslim should know of
[…] సంకల్ప శుద్ధి […]