మనలోని ప్రతి వ్యక్తీ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని విజయవంతమైన జీవితం గడపాలనే కోరుకుంటాడు. అయితే విజయవంతమయిన జీవితం అంటే ఏమిటి అన్నది వ్యక్తుల ఆలోచనాధోరణిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని ముఖ్యంగా రెండు విభిన్న భాగాలుగా విభజించవచ్చు. ఒకటి భౌతిక ప్రధానమయిన దృక్పథం. మంచి తిండి, ఖరీదయిన బట్టలు, అందమయిన బంగ్లా, డబ్బు, సంతానం, పేరు, పలుకుబడి, అధికారం, హోదా, అంతస్తు, ప్రభుత్వం మొదలయినవన్నీ ఈ కోవకు చెందుతాయి. భౌతిక ప్రధానమైన ఇలాంటి జీవితాన్నే కొందరు విజయవంతమైన జీవితమనుకుంటారు. కాని ఇస్లామ్ దృష్టిలో విజయం అంటే భౌతిక ప్రధానమయిన విజయం కాదు. దేవుని ప్రసన్నతకు, స్వర్గ సౌఖ్యాలకు అర్హుడయ్యేలా ఈ ప్రపంచంలో పవిత్రమయిన జీవితం గడిపి, అదే స్థితిలో తనువు చాలించడమే ఇస్లామ్ దృష్టిలో నిజమయిన విజయం.
జయాపజయాలకు సంబంధించిన ఈ భావనే ప్రజల ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ప్రజలకు దైవం వివిధ భౌతిక వస్తువుల్ని ఇచ్చి, భౌతికపరంగా వారిని సుఖ సంతోషాలలో తేలియాడేలా చేస్తే సాధారణంగా వారు ఇదంతా తాము సాధించుకున్న విజయమని అపోహపడతారు. మరి కొందరు ఇంకో అడుగు ముందుకువేసి వీటన్నిటిని తమంతట తాము సాధించుకున్నామని గర్వపడటమేగాక, తాము దేవునికి ప్రియమయినవారమని కూడా తలుస్తారు. అసలు తాము దేవునికి ప్రియమయినవాళ్ళం కాబట్టే ఆయన తమకివన్నీ ఇచ్చాడని అనుకుంటారు వీరు. ఇక ఏ భౌతిక సౌఖ్యాలూ లభించని పేద వాళ్ళను గురించి కూడా వీరు అపోహలోపడతారు. ఈ పేద వాళ్ళు సరైన మార్గం మీద లేరని, అందుకే దేవుడు ఆగ్రహించి వీరిని రకరకాల కష్టాలపాలు చేశాడని అనుకుంటారు.
ఇలాంటి తప్పుడు భావన ఏర్పడడానికి ఒక పెద్ద కారణం ఉంది. ప్రజలు ఈ ప్రపంచం న్యాయం లేదా అన్యాయం జరిగే స్థలం కాదని భావించరు. నిజానికి ఈ ప్రపంచం మానవుల కోసం ఒక పరీక్షా స్థలం. ఒక క్రియా మైదానం. ఇక్కడ మనిషి ఏ స్థితిలో ఉన్నా అది అతనికోసం ఒక పరీక్ష. అంటే మనిషి ఇక్కడ ఏ స్థితిలో ఉంటే దేవుడు ఆ స్థితిలోనే అతడ్ని పరీక్షిస్తాడన్న మాట. అసలిక్కడ మనిషికి అతను చేసిన పనులకు నైతికంగా న్యాయంగాని, శిక్షగాని లభించదు. ఒకవేళ లభించినా చాలా పరిమితంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి స్థితిలోనూ పరీక్షే ఉంటుంది.
ఎవరికయినా ఇక్కడ సిరిసంపదలు, సంతానం, అధికారం, హోదా, అంతస్తులు లభిస్తే, దేవుడు అతడ్ని అదే స్థితిలో పరీక్షిస్తాడు. ఇన్ని సౌఖ్యాలు పొంది, ఈ స్థాయికి చేరుకున్న తరువాత అతని ఆచరణ, నడవడికలు ఎలా ఉంటాయి అని దేవుడు అతడ్ని పత్రి కణం పరీక్షిస్తుంటాడు. అయితే మరొకరిపై దారిద్ర్యం తాండవిస్తూ కష్టాలపై కష్టాలు వచ్చిపడుతుంటాయనుకోండి, ఇది తప్పనిసరిగా దైవ శిక్షే అని అర్థం కాదు. అతనిపై వచ్చిపడుతున్న ఆపదల పరంపర దేవుని ఆగ్రహం కానవసరంలేదు. ఈ పరిస్థితి కూడ అతనికోసం ఒక పరీక్షే.
